
జోగులాంబ గద్వాల, 02 ఏప్రిల్ (హి.స.)
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులే కాక ప్రతి ఒక్కరూ సహకరించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గద్వాల మండలం చేనుగోనుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు భోజనం పథకాలను మధ్యాహ్న ప్రవేశపెడుతుందన్నారు.
ఇటీవలే రైతు భరోసా పంటల పెట్టుబడి సాయాన్ని ఎకరా లోపు పొలం ఉన్న రైతులకు ఇవ్వడం జరిగిందని, మిగతా రైతులకు కూడా దశలవారీగా రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు.
గ్రామాల్లో ఉండే బాల్యవివాహాలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రతి ఒక్క పౌరులు స్పందించి.. వాటి నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామ సభను ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు