
న్యూఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)
2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్లోనే అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచ డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్లో 65 ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగాయి. ఒక ప్రజాస్వామ్య దేశానికి ఇది ఆందోళన కలిగించే అంశమని నివేదిక అభిప్రాయపడింది. గత ఏడాది భారత్లోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిరసనలు, ఘర్షణ పరిస్థితులు, మతపరమైన పండుగల సమయంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారని తెలిపింది. గత సంవత్సరం 52 దేశాల్లో మొత్తం 313 ఉద్దేశపూర్వక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయి. 2016 తర్వాత ఇదే అత్యధికం.
మయన్మార్ 95 ఘటనలతో వరుసగా రెండో ఏడాది కూడా టాప్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్స్ విధించిన దేశంగా భారత్ను అధిగమించింది.చట్టప్రకారం ఇంటర్నెట్ షట్డౌన్ ఉత్తర్వులను ప్రచురించాల్సి ఉన్నా.. దీనిపై భారత్ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నదని ‘యాక్సెస్ నౌ’ విమర్శించింది. ప్రజాస్వామ్యానికి ప్రాథమికంగా విరుద్ధమని తెలిసినా.. దీనిని విస్మరించి దేశ ప్రజల గొంతుకలపై నియంత్రణను ఎంచుకున్నదని నివేదిక పేర్కొన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi