
అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.), :అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు అనకాపల్లికి తరలిస్తుండగా చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు యువకులు ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.మృతులు బంగారు నాని(24), గోవిందు (25) , పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారి దుర్గాప్రసాద్(16)గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకోగా, మరో యువకుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ