
అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.)
తిరువూరు రూరల్ మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న ఐదుగురు మైనర్లను గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్యాటరింగ్ పని నిమిత్తం మైనర్లు నూజివీడు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్పై ఐదుగురు మైనర్లు ప్రయాణించారు. లక్ష్మీపురంలో ఒకర్ని ఇంటి వద్ద దింపేందుకు ఎన్హెచ్ 216హెచ్ వద్ద బైక్ దిగారు.
రహదారిపై ఉన్న వీరిని గుర్తు తెలియని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నక్కా ఈశ్వర్(16), మోదుగు సన్నీ(17) అనే ఇద్దరు మైనర్లు స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17), బాలమర్తి చరణ్ తేజ్(17)గా గుర్తించారు.
వీరిలో చరణ్ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడకు తరలించారు. సమాచారం అందిన వెంటనే సీఐ కె.గిరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ