
హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా
రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్లోలో జరిగిన 13వ ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ (ATEXCON) 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని సీఎం గుర్తుచేశారు. 'టెక్స్టైల్ అనేది మనకు కేవలం ఒక పరిశ్రమ కాదు, అది మన జీవనాధారం. నిజాం కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్కు వచ్చేవారు.' అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
తెలంగాణను దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతూ.. వరంగల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సీఎం తెలిపారు.
హైదరాబాద్ ఇప్పుడు కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, నెటిక్స్ వంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని సీఎం అన్నారు. సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ 'గ్రీన్ టెక్స్టైల్ హబ్'లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచింగ్లో శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు