
హుజురాబాద్, 03 ఏప్రిల్ (హి.స.) హుజూరాబాద్ పట్టణ శివారులోని సిరసపల్లి వద్ద ఏర్పాటు చేయ తలపెట్టిన 'వేస్ట్ టు ఎనర్జీ' (డంపింగ్ యార్డ్) ప్లాంట్కు వ్యతిరేకంగా సాగుతున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఈ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన హుజూరాబాద్ పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రజా క్షేమాన్ని పణంగా పెట్టి జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ నిర్మించవద్దంటూ నిరసనకారులు గళమెత్తారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నుంచే హుజూరాబాద్ పట్టణం పూర్తిగా స్తంభించిపోయింది. పట్టణంలోని ప్రధాన వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. నిత్యావసర సేవలు మినహా మిగిలిన అన్ని రంగాలు బంద్ లో పాల్గొన్నాయి. ముఖ్యంగా పెట్రోల్ బంకులు సైతం మూసివేసి యజమానులు నిరసనకు మద్దతు తెలపడం గమనార్హం.
ఉదయం 7 గంటల నుంచే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
సిరసపల్లి శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శుక్రవారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనకారులు బైఠాయించి ప్రభుత్వం, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.బంద్ నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఈ భారీ మద్దతును చూసైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..