
హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టును ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టడమే ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎన్జీటీ కేసు డిస్పోజ్తో కాస్త ఊరట లభించింది. అయితే మొదటి దశ 21 కిలోమీటర్ల ప్రాజెక్టులో భాగంగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టును పబ్లిక్, ప్రయివేటు పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
'మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు కాకుండానే రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా. . హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణశాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది.
మూసీ, ఈసీ నదుల సంగమంగా ఉన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈ కేంద్రాన్ని పీపీపీ మోడ్లో ప్రపంచ స్థాయి ఫెసిలిటీ సెంటర్గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం ఉండే భవనం 100 మీటర్ల వరకు ఉంటుంది. దీనిపై గాంధీ విగ్రహం 123 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. దీంతోపాటు గాంధీ సరోవర్లో శాంతి విగ్రహంతోపాటు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ చేసిన పోరాటాలు, ఆయన ఫిలాసపీకి సంబంధించిన జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.దీంతోపాటు పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నదీ తీరంలో సేదతీరడానికి ధ్యాన గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ తీర ఘాట్లతో కూడిన ప్రజా వినోద కేంద్రాలకు పెద్దపీట వేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..