
హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ఆర్టీసీ స్టాఫ్ను జిల్లాలకు పంపించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుండటంతో... అక్కడ డ్రైవర్లు, మెకానిక్ లు, హెల్పర్ల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర జోన్లు, విభాగాలకు మార్చేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్కు చెందిన డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు హైదరాబాద్, కరీంనగర్ జోన్లలోని రీజియన్లలో డిప్యూటేషన్పై పనిచేయడానికి తమ ఆప్షన్స్ ఇవ్వవచ్చని ప్రకటించింది. కనీసం పదో తరగతి అర్హత ఉన్న డ్రైవర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కండక్టర్లుగా మారేందుకు ఆప్షన్ ఇవ్వవచ్చు. మెకానిక్లను ఏడీసీలుగా, బస్ పాస్ కౌంటర్లలో లేదా హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే పార్కింగ్ డ్రైవర్లుగా ఓడీ ప్రాతిపదికన నియమించనున్నారు. ఇందుకో కోసం ఏప్రిల్ 15ను గడువుగా నిర్ణయించారు. డిప్యూటేషన్ లేదా రీ-కేటగిరీ... ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలే తమ సొంత డ్రైవర్లను, మెకానిక్లు, హెల్పర్లను కేటాయిస్తాయి. దీంతో ఆ బస్సుల నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు సంస్థలదే ఉంటుంది. ఈ బస్సుల్లో కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ నుంచి అవసరమవుతారు.
ఈ కొత్త విధానంతో ఆర్టీసీలో భవిష్యత్తులో డ్రైవర్లు, మెకానిక్ల రిక్రూట్మెంట్లు ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం పెరగడంతో ఆర్టీసీ తన సొంత సిబ్బందిని ఇతర విధులకు మళ్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేసుకున్న 3వేల ఆర్టీసీ పోస్టుల భర్తీ ఏమో కానీ కనీసం 300 పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. ఓవైపున బస్ భవనన్ను ఇతర శాఖలకు కేటాయిస్తున్న సర్కారు... మరోవైపున నగరానికి చెందిన ఆర్టీసీ సిబ్బందిని సైతం జిల్లాలకు డిప్యూటేషన్పై పంపించేందుకు రంగం సిద్ధం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..