
, దేవీపట్నం, 30 ఏప్రిల్ (హి.స.)
: గోదావరి నదికి ఇరువైపులా పాపికొండల మధ్య ఉరకలెత్తే గోదావరి అందాలను తిలకిస్తూ 8 గంటల పాటు సాగే పాపికొండల విహారయాత్రను ఒక్కసారైనా చూడాల్సిందే. మొన్నటి వరకు రోజుకు ఒక బోటులో మాత్రమే విహారయాత్రకు పర్యాటకులు వెళ్లేవారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రైవేట్ బోట్లు 15, ఏపీటీడీసీ 1 బోటు మొత్తం 16 బోట్లు ఉండగా దాదాపుగా అన్ని బోట్లు విహారయాత్రకు వెళ్తే 1200 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించవచ్చు.
రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్కు చేరుకుంటారు. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ట్రావెల్స్ బస్సులో కొవ్వూరు మీదుగా ఏల్లూరు జిల్లా పోలవరం వస్తారు. అక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం మీదుగా గండిపోశమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది.
రాజమహేంద్రవరం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకులు పెద్దవారైతే రూ.1250లు, చిన్న పిల్లలు అయితే 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్లలోపు వారికి రూ.1,050 చెల్లించాలి. వీరికి బోటులో అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ అందజేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ