
గుంటూరు: 30 ఏప్రిల్ (హి.స.)
నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు. గుంటూరులో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి నల్లపాడు, పేరేచర్ల, వేమూలూరిపాడు, ఫిరంగిపురం, నుదురుపాడు, సాతులూరు, నరసరావుపేట, మునమాక, సంతమాగులూరు, శావల్యాపురం జంక్షన్, వినుకొండ, చీకటీగలపాలెం, గుండ్లకమ్మ, దర్శి, రాజంపల్లి, మల్లవరం, పొదిలి మీదగా మధ్యాహ్నం 1 గంటకు కనిగిరి చేరుకునేలా ప్రతిపాదించారు
కనిగిరి - గుంటూరు మెమూ రైలు నిత్యం(ఆదివారం మినహా) మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా తిరుగు ప్రయాణమై రాత్రి 7 గంటలకు గుంటూరు చేరుకునేలా ప్రతిపాదన రైల్వేబోర్డుకు వెళ్లింది. దీని వలన కనిగిరి, దర్శి వంటి ప్రాంతాలకు ప్రప్రథమంగా రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే రైల్వేబోర్డు నుంచి ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ