ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్ తో పోలిస్తే రూ.95.23కు డ్రాప్
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్ తో పోలిస్తే రూ.95.23కు డ్రాప్
Rupee


ముంబై, 30 ఏప్రిల్ (హి.స.)

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి

విలువ మళ్లీ పడిపోయింది. అమెరికన్ (American) డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇవాళ ఏకంగా రూ.95.23 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారెల్ 113 డాలర్లకు చేరింది. భారత్ (India) తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో చమురు ధరల పెంపు రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, డాలర్కు విపరీతమైన డిమాండ్ పెరగడం కూడా రూపాయి విలువను తగ్గించాయి. చమురు ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడమే కాకుండా, దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతోంది. అదేవిధంగా సెన్సెక్స్ 960 పాయింట్లకిపైగా, నిఫ్టీ 300 పాయింట్లకి పైగా పడ్డాయి. 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 76,520 వద్ద, నిఫ్టీ 23,880 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసుకునే ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు దినుసులు, ముఖ్యంగా ఇంధన ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande