
సంగారెడ్డి, 30 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన విశిష్టమైన సజ్జాపూర్ చామదుంప (Sajjapur Colocasia) భౌగోళిక గుర్తింపు (Geographical Indication - Gl Tag) మరో కీలక మైలురాయిని చేరుకుంది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో ఈ ఉత్పత్తికి సంబంధించిన దరఖాస్తును నిపుణుల కమిటీ పరిశీలించింది. సజ్జాపూర్ ప్రాంతంలో పండే ఈ చామదుంపలు వాటి ప్రత్యేకమైన రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. ఇవి మార్కెట్లో లభించే సాధారణ చామదుంపల కంటే భిన్నంగా ఉండటమే కాకుండా, త్వరగా ఉడికే గుణాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ పంటకు జీఐ ట్యాగ్ లభిస్తే, సంగారెడ్డి ప్రాంత రైతులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ లభించనుంది. దీంతో ఎగుమతులు పెరగడమే కాకుండా.. రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఉద్యానవన శాఖ ఈ చామదుంపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తోంది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే అధికారికంగా జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే తాండూరు కందిపప్పు వంటి ఉత్పత్తులు జీఐ జాబితాలో ఉండగా, ఇప్పుడు సజ్జాపూర్ చామదుంప కూడా م గౌరవాన్ని దక్కించుకోనుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చామదుంపలకు భౌగోళిక గుర్తింపు లభిస్తే, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..