చట్టం ముందు నిలబెడతాం.. పోలీస్ అధికారులకు అంబటి వార్నింగ్ (update)
చట్టం ముందు నిలబెడతాం.. పోలీస్ అధికారులకు అంబటి వార్నింగ్
అంబటి


కడప 30 ఏప్రిల్ (హి.స.)కడప జిల్లా, వేంపల్లి పీఎస్లో అంబటి రాంబాబు విచారణ రెండు గంటలపాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు పెట్టారని, లోకేష్ ఆదేశాలతో కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్ వారసులమని, ఎవరికీ భయపడేది లేదని, వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేకంగా పనిచేసే పోలీసు అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

కడప జిల్లా(Kadapa District) వేంపల్లి పోలీస్ స్టేషన్(Vempally Police Station)లో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)పై సాగిన విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం స్టేషన్ బయట అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన విచారణ తీరును వివరించారు. ఒకే అంశాన్ని సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్ వారసులమని, ఇలాంటి బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని, అధికార గర్వంతో వ్యవహరించడం మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande