
ప్రొద్దుటూరు ,06 ఏప్రిల్ (హి.స.)
ప్రొద్దుటూరు నేరవార్తలు, ప్రొద్దుటూరులో దొంగలు చెలరేగిపోతున్నారు. ఇళ్ల ఎదుట, వీధుల్లో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. మారు తాళాలతో సులువుగా అపహరించి పరారవుతున్నారు. మరోవైపు వాహనాల్లోని పెట్రోల్ను కూడా మాయం చేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో కొందరు నిలిపి ఉంచి వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. నిప్పంటిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలతో పట్టణ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇతర పనుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల వాసులు ప్రొద్దుటూరులో నివసిస్తున్నారు. సరిపడా స్థలం లేకపోవడంతో ఇళ్ల ఎదుట, రోడ్లపై చక్ర వాహనాలు నిలుపుతున్నారు. దీంతో దొంగలు రాత్రి సమయంలో రెక్కీ నిర్వహించి ఆపై అపహరిస్తున్నారు. ప్రధానంగా పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, హోమస్పేట, గాంధీ రోడ్డు, కోనేటి కాల్వ వీధి, రామేశ్వరం, వాసవీ సర్కిల్, మైదుకూరు రోడ్డు, జిన్నారోడ్డు, వైఎంఆర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు నిలిపి పని ముగించుకుని వచ్చేలోపు మాయమవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దొంగలపై పోలీసులు గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని, రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ