
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)విజయవాడ నగరాన్ని శివారు ప్రాంతాలతో కలిపే ప్రధానమైన మూడు రహదారులకు మోక్షం లభించింది. మహానాడు రోడ్డును పోరంకి-నిడమానూరు ప్రధాన రహదారి(మురళీరిసార్ట్స్ రోడ్డు) వరకూ పొడిగింపు, ఆటోనగర్ బస్టాండ్ పక్క నుంచి ఉన్న రోడ్డును నేరుగా మురళీనగర్ వరకూ 80 అడుగుల రోడ్డుగా విస్తరణ, బల్లెంవారివీధి నుంచి నిడమానూరు ప్రధాన రహదారి వరకూ మరో రోడ్డు విస్తరణ పనులకు.. ఈ నెల 7న శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామంటూ గతేడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఈ మూడు ప్రధాన రహదారులను సీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టేందుకు రూ.105 కోట్లు మంజూరు చేశారు.
విజయవాడ తూర్పు, పెనమలూరు, గన్నవరం ఈ మూడు నియోజకవర్గాలను అనుసంధానం చేసే కీలక రహదారులివి. ఇవి పూర్తయితే విజయవాడ శివారులోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలకు అత్యంత తేలికగా వెళ్లిపోవచ్చు. విజయవాడలోని బందరురోడ్డు, ఎన్హెచ్ 16 జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ప్రధానంగా కానూరు, పోరంకి, తాడిగడప, నిడమానూరు, ఎనికేపాడు, గంగూరు, పెనమలూరు, కంకిపాడు ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఈ ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించేందుకు వీలవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ