
హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)
ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, బీజేపీ ప్రస్థానం, ఆశయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రహితమే సర్వోపరి' (దేశ ప్రయోజనాలే అత్యున్నతం) అనే సంకల్పంతో పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు ఈ అభినందనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ప్రత్యేకమైన ట్వీట్ చేసిన అమిత్ షా.. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయల (జాతీయవాద) ఆలోచనలు, వైజ్ఞానిక ప్రేరణతో ఏర్పడిన బీజేపీ ఆవిర్భావం కేవలం ఒక రాజకీయ ఘటన మాత్రమే కాదని, అది దేశ పునర్నిర్మాణం కోసం తీసుకున్న ఒక గొప్ప సంకల్పమని అమిత్ షా కొనియాడారు.
సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి సంక్షేమమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు ప్రధాని మోడీ నాయకత్వంలో 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే మంత్రంతో సాకారం అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత దేశంలో బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా, 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచిందని అమిత్ షా గర్వంగా ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..