
బెంగళూరు, 08 ఏప్రిల్ (హి.స.)
మామిడి పండ్ల సీజన్ మొదలైందంటే చాలు మార్కెట్లు పసుపు రంగు పండ్లతో కళకళలాడుతుంటాయి. అయితే, చూడ్డానికి మెరిసిపోతున్నాయని పండ్లను కొంటే మీరు విషాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లేనని బెంగళూరుకు చెందిన ఆరోగ్య నిపుణులు డా. అబ్బేగేరి మంజళు ఎన్ హెచ్చరిస్తున్నారు. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. వ్యాపారులు లాభాల కోసం నిషేధిత క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కెమికల్స్తో పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..
వేసవిలో మామిడి పండ్లకు ఉండే గిరాకీని ఆసరాగా చేసుకుని, వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్ (Calcium Carbide) ఉపయోగించి కాయలను రాత్రికి రాత్రే పండిస్తున్నారు. సాధారణంగా మామిడి కాయలు పక్వానికి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ క్యాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడటం వల్ల కేవలం కొన్ని గంటల్లోనే కాయలు పండుగా మారిపోతాయి. ఈ కార్బైడ్ విడుదల చేసే అసిటిలిన్ వాయువు వల్ల పండు రంగు మారుతుంది కానీ, అందులో సహజమైన తీపి, సువాసన ఉండవు.
పండ్లను కొన్న తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద మరికొన్ని రోజులు ఉంచి తినడం మంచిది. తినడానికి ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పండ్లను బాగా కడగాలి. నమ్మకమైన రైతులు లేదా సేంద్రీయ (Organic) దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV