సామాన్యుడికి ఆర్బీఐ ఊరట: నియంత్రణలోనే ద్రవ్యోల్బణం.. 4.6 శాతంగా అంచనా
సామాన్యుడికి ఊరట
RBI


ఢిల్లీ , 08 ఏప్రిల్ (హి.స.)

2026-27 ఆర్థిక సంవత్సరానికి

సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనను (RBI Policy Review) విడుదల చేసింది. ఏప్రిల్ 6న ప్రారంభమైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం ముగిసింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే పాలసీ విధానం (Stance) కూడా స్థిరంగానే కొనసాగుతుందని వెల్లడించారు. అంటే వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై కూడా ఆర్బీఐ ఒక అంచనాకు వచ్చింది. ఈ ఏడాది భారత దేశం 6.9 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే నాలుగు త్రైమాసికాల్లో కూడా దేశ వృద్ధి రేటు 6.7 శాతం నుండి 7.2 శాతం మధ్యలో నిలకడగా కొనసాగుతుందని వివరించారు.

ఎన్టీఎఫ్ రేటు 5 శాతంగా, అలాగే ఎంఎస్ఎఫ్ మరియు బ్యాంక్ రేట్లు 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంటాయని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల మధ్య ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande