
హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)
భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. దశాబ్దాలుగా పార్టీ ఎదుగుదల కోసం అంకితభావంతో పనిచేసిన కోట్లాది మంది కార్యకర్తల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. 'దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలకు స్థాపనా దినోత్సవ శుభాకాంక్షలు. 'ఇండియా ఫస్ట్' అనే సిద్ధాంతంతో మన పార్టీ ఎల్లప్పుడూ సమాజ సేవలో అగ్రభాగాన నిలుస్తోంది. నిస్వార్థ సేవ, అచంచలమైన అంకితభావం, సుపరిపాలన పట్ల ఉన్న మక్కువ మా కార్యకర్తల సొంతం' అని ప్రధాని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు అలుపెరగని కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందని తెలిపారు. “వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పానికి బీజేపీ కట్టుబడి ఉంది. మనందరి సమిష్టి కృషితో ఈ విజన్ ముందుకు సాగాలి. భారతదేశాన్ని పురోగతి, శ్రేయస్సులో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..