
శ్రీనగర్, 07 ఏప్రిల్ (హి.స.)
దేశంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత
ఉగ్రవాద కార్యకలాపాల పై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మరో భారీ విజయాన్ని సాధించారు. శ్రీనగర్ కేంద్రంగా సాగుతున్న లష్కరే తోయిబా (LeT) అంతర్రాష్ట్ర ఉగ్రవాద నెట్వర్ను పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులతో సహా మొత్తం ఐదుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్ లోయలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఈ ముఠా కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఉగ్రవాద ముఠా కేవలం కాశ్మీర్కే పరిమితం కాకుండా రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉండటం గమనార్హం. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దేశవ్యాప్తంగా మొత్తం 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఇతర నేరపూరిత సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని విచారించడం ద్వారా ఈ నెట్వర్క్ ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల పోలీసులతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఆపరేషన్ను సమన్వయం చేసుకుంటున్నారు. ఉగ్రవాద నెట్వర్క్లను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..