టిటిడి కల్తీ నెయ్యి కేసులో దోషి నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టిటిడి కల్తీ నెయ్యి కేసులో దోషి నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టిటిడి కల్తీ నెయ్యి కేసులో దోషి నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్


అమరావతి, 01 మే (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సర్కారు నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ దినేశ్కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తే, వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. దినేశ్కుమార్ గురువారం సాయంత్రం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ను కలిసి ఈ మేరకు నివేదికను సమర్పించారు. తిరుమల కల్తీనెయ్యి సరఫరా విషయంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. వీటి ఆధారంగా అసలు కల్తీనెయ్యి కేసులో అధికారుల పాత్ర ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ దినేశ్కుమార్ను ఏకసభ్య కమిషన్గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవో 458 జారీ చేసింది.

45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, విచారణ సంక్లిష్టంగా ఉండటంతో మధ్యలో కమిషన్ విచారణ గడువును పొడిగించారు. దినేశ్కుమార్ విచారణ ఇప్పుడు కొలిక్కివచ్చింది. అనేక అంశాలపై సమగ్ర పరిశీలన చే సి నివేదిక రూపొందించి ఆయన ప్రభుత్వానికి అందించారు. నిబంధనల సడలింపు వల్లే కల్తీనెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో, ఐఏఎస్ అధికారి అనిల్కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, చేయకపోయినా తప్పు అయితే జరిగిందని, దీని వల్లే కల్తీనెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేశ్కుమార్ సిఫారసు చేసినట్లు తెలిసింది. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన పదార్ధాల కొనుగోలు విధానం, టెండర్లు, నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తె లిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏది తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని, అలా చేసినందువల్లే టీటీడీలో కల్తీనెయ్యికి ఆస్కారం ఏర్పడిందని క మిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి అత్యంత నాణ్యమైనదయి ఉండాలని, చీపెస్ట్, లోయెస్ట్ విధానాలను ప్రామాణికంగా తీసుకొని టెండర్లు నిర్వహిస్తే కల్తీ సరుకులు సరఫరా అయ్యే అవకాశం ఉందని ఈ ఉదంతం ప్రత్యక్షంగా నిరూపించిందని తెలిపింది. ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చి, నాణ్యతగల నెయ్యి సరఫరానే ప్రామాణికంగా తీసుకొనేలా టెండర్ నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇంకా కొనుగోలు, పాలన, విజిలెన్స్, పర్యవేక్షణ వంటి అనేక అంశాల్లో సమూల మార్పులు తీసుకురావాలని, జవాబుదారీని తీసుకొచ్చేలా విధానాలు అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande