
అమరావతి, 01 మే (హి.స.)
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కంటే ఈసారి 4.15 శాతం మెరుగుపడింది. గతేడాది 81.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 85.25శాతం పాసయ్యారు. మొత్తంగా 6,18,131 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 5,26,954 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి. అబ్బాయిలు 2,59,633 (82.68శాతం) మంది, అమ్మాయిలు 2,67,321 (87.9శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.22శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ గురువారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. 16 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 2161 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 96.07శాతంతో టాప్లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12 శాతంతో చివరిన ఉంది. మేనేజ్మెంట్ల వారీగా అయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక పాసైన మొత్తం విద్యార్థుల్లో 83.69శాతం మంది ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణులయ్యారు. విశాఖపట్నానికి చెందిన జ్ఞానేశ్వరి 599 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచింది. 47 మంది విద్యార్థులకు 598 మార్కులు రావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ