ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ప్రభుత్వం చెబుతున్న గొప్పల్లో డొల్లతనం
ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ప్రభుత్వం చెబుతున్న గొప్పల్లో డొల్లతనం
ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ప్రభుత్వం చెబుతున్న గొప్పల్లో డొల్లతనం


అమరావతి, 01 మే (హి.స.)

ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామంటూ ప్రభుత్వం చెపుతున్న గొప్పల్లోని అసలు డొల్లతనం ఇప్పుడు బయటపడుతోంది. రాష్ట్రంలో 470కు పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా... 50 కాలేజీల్లో కనీసం 40శాతం మంది కూడా ఉత్తీర్ణులు కాలేదు. ఆ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఈనెల 5న సమావేశం నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అతి తక్కువ ఫలితాలు రావడానికి కారణాలు, భవిష్యత్తులో ఫలితాలు ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై ఇందులో చర్చించనున్నారు. కాగా కొన్ని కాలేజీల్లో మరీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి.

అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ఉర్దూ కాలేజీలో ఈ ఏడాది 49 మంది పరీక్షలకు హాజరైతే కేవలం ముగ్గురు పాసయ్యారు. ఇక్కడ ఉత్తీర్ణత 6.12శాతం. కడప జిల్లాలోని పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 102 మంది పరీక్షలు రాస్తే వారిలో కేవలం 8 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఉత్తీర్ణత 7.84శాతం. అదే జిల్లాలోని పులివెందుల కాలేజీలో 48 మందిలో 14 మంది, తొండూరులో 58 మంది విద్యార్థుల్లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు. అనంతపురం జిల్లాలోని కంబదూర్ కాలేజీలో 62 మంది పరీక్షలు రాయగా పాసైంది పట్టుమని 12 మంది మాత్రమే. అదే జిల్లాలోని పీలేరులో 98 మందిలో 32 మంది ఉత్తీర్ణులయ్యారు..

ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూర్ కాలేజీలో 94 మంది పరీక్షలు రాస్తే కేవలం 14 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం కాలేజీలో 12 మందిలో ఒక్కరే పాసయ్యారు. అదే జిల్లాలోని బాపట్ల కాలేజీలో 21 మందిలో ముగ్గురు పాసయ్యారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి కాలేజీలో 45 మంది పరీక్షలు రాస్తే ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఏలూరు జిల్లాలోని కలిదిండి కాలేజీలో 38 మంది విద్యార్థుల్లో 8 మంది ఉత్తీర్ణులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు కాలేజీలో 24 మందిలో కేవలం నలుగురు పాసయ్యారు. కోనసీమలోని కేసనపల్లి కాలేజీలో ఏడుగురిలో ఇద్దరే ఉత్తీర్ణులయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం కాలేజీలో 119 మందిలో 44 మంది ఉత్తీర్ణులయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గంగవరం కాలేజీలో 43 మందిలో 13 మంది విద్యార్థులు పాసయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక కాలేజీలో 17 మందిలో ముగ్గురే పాసయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande