
పశ్చిమగోదావరి జిల్లా, 12 మే (హి.స.)
రాయలసీమను సీఎం చంద్రబాబు సస్యశ్యామలం చేశారని ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్వ్యాఖ్యానించారు. రాయలసీమకు నేడు చంద్రబాబు వల్లే సాగునీరు వస్తోందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి ఫరూక్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలోని కొండల చుట్టూ ఉన్న చెరువులన్నీ నింపి తెలుగు గంగ ద్వారా రైతులకు తమ ప్రభుత్వం సాగునీరు అందిస్తోందని తెలిపారు.
గతంలో అనంతపురం జిల్లా దేశంలో వెనుకబడిన జిల్లాల్లో రెండోదిగా ఉండేదని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అంతా సస్యశ్యామలమై జీడీపీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీలో షాదీఖానాల ఏర్పాటుకు అంకురార్పణ చేసింది దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ప్రస్తావించారు. నేడు హజ్యాత్రకు రూ.లక్ష కేటాయించి ముస్లింలను సీఎం చంద్రబాబు గౌరవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తమను గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకోలేమని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ