
హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడి ని ఉరి తీసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఇవాళ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మైనర్లపై రోజూ దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో నిందితుడిని ఉరితీసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అలాగే బాలికకు నెలకు రూ.50 వేల పించన్, తల్లిదండ్రులకు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు