
కామారెడ్డి, 13 మే (హి.స.)
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం గిద్ద గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే 4 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ORS ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..