చివరి గింజ వరకు మద్దతు ధరతో కొంటాం: దేవరకొండ ఎమ్మెల్యే
చివరి గింజ వరకు మద్దతు ధరతో కొంటాం: దేవరకొండ ఎమ్మెల్యే
MLA


నల్గొండ, 15 మే (హి.స.)

దేశ చరిత్రలోనే అత్యధికంగా వరిధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండించిందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ భరోసా ఇచ్చారు. చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం, వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలుపై అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్లతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, మద్దతు ధర, తూకంలో పారదర్శకత, గోనె సంచుల లభ్యత, మిల్లులకు తరలింపుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆందోళన పడొద్దు. రూ.22 వేల కోట్లతో సుమారు 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఈ యాసంగిలో కొనుగోలు చేయబోతున్నాం. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొంటాం. ధాన్యంలో తాలు, చెత్త ఉందని కటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. అక్కడక్కడ లారీలు, హమాలీల కొరత ఉంది.ఇతర అవసరాలకు వాడే లారీలు, డీసీఎంలను కొద్ది రోజులు ధాన్యం తరలింపుకు వాడాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలి. రైతు పక్షపాతి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేయడం సిగ్గుచేటు. గతంలో ధాన్యం సేకరణ నిర్ణయమే ఏప్రిల్ చివరిదాకా పట్టేది. ఖమ్మంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టిన చరిత్ర బీఆర్ఎస్. గత ప్రభుత్వం 'వరిస్తే ఉరి' అంటే, ప్రజా ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇస్తోంది. . . రైతు వ్యతిరేక ప్రతిపక్షం మాటలు నమ్మవద్దు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా ఉంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande