
ములుగు, 13 మే (హి.స.)
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని, నాణ్యమైన విద్య ప్రమాణాలకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు నిరంతరంగా కృషి చేస్తూ లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక విద్య వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మండల, మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం విద్యార్థులను చేర్పించడం తో పాటు వారికి నాణ్యమైన విద్యాబోధన అందే విధంగా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని, బాల్యం నుండే నాణ్యమైన విద్యాబోధన అందిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, సమాజ నిర్మాణం లో బలమైన పునాది వేయడానికి పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి పలు చారిత్రాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..