హైదరాబాద్లో ఉబెర్ విస్తరణ.. సీఎం రేవంత్ రెడ్డితో సీఈవో భేటీ
హైదరాబాద్లో ఉబెర్ విస్తరణ.. సీఎం రేవంత్ రెడ్డితో సీఈవో భేటీ
Uber


హైదరాబాద్, 13 మే (హి.స.)

తెలంగాణలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రముఖ అంతర్జాతీయ రవాణా సేవల సంస్థ 'ఉబెర్' (Uber) సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ కార్యకలాపాల విస్తరణ, కొత్త పెట్టుబడులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉబెర్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా సీఇవో ఖోస్రోషాహి తెలిపారు. హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు సీఎంకు వివరించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ మొదటి సెంటలో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని వివరించిన దారా ఖోస్రోషాహి.. భారత్ ఫ్యూచర్ సీటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. పార్కింగ్ వ్యాపారంలోకి వచ్చే అంశాన్ని పరిశీలించాలని దారా ఖోస్రోషాహికి సీఎం సూచించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో పార్కింగ్ సమస్యను ఉబెర్ ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన సీఎం.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి సూచనపైన సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధులు తెలిపారు. వ్యాపార విస్తరణకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఉబెర్ ఉబెర్ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్, ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande