
మెదక్, 13 మే (హి.స.)
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం చేగుంట మండలం మక్క రాజుపేట వద్ద రైతులు చేగుంట-గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందని లారీల కొరత కారణంగా ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతులు దాదాపు గంట పాటు రహదారిపై ధర్నా నిర్వహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షాలు కురిసిన కారణంగా ఇప్పటికే పంట నష్టపోయామని ఇప్పుడు కొనుగోళ్లలో జాప్యం వల్ల మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం రోజుల తరబడి అక్కడే ఉంటుందన్నారు. గోనె సంచుల కొరత లారీల సమస్య అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరించకపోవడం వల్లే నెలకొందని రైతులు ఆరోపించారు. వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, రామాయంపేట సీఐ సైదా సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సకాలంలో లారీలు పంపించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..