
రాజమండ్రి, :, 14 మే (హి.స.)
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పది మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రాజాంలోని పనసలవలస ప్రాంతానికి చెందిన నారు సాయి అనిల్ కుమార్ (24)గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ