నేరాల నియంత్రణకు కఠిన చర్యలు -డీఎస్పీ కేవీ మహేష్
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు -డీఎస్పీ కేవీ మహేష్
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు -డీఎస్పీ కేవీ మహేష్


హిందూపురం, 02 మే (హి.స.) : నేరాలను అరికట్టడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడం లక్ష్యంగా శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్ర ప్రవహార్ లో భాగంగా శనివారం తెల్లవారుజాము నుండి హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ కాలనీలో సోదాలు చేపట్టారు. డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు సహా మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసులు ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి ముఖ్యంగా రౌడీ షీటర్లు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. సోదాల సందర్భంగా నంబర్ ప్లేట్లు, సరైన రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారును పోలీసులు సీజ్ చేశారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఉంచి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సరైన పత్రాలు చూపని వారిపై సి ఆర్ పి సి 102 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం డీఎస్పీ కేవీ మహేష్ గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, అనుమానితులైన వ్యక్తులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అలాగే రౌడీయిజం చేసే వారి కుటుంబ సభ్యులు వారిపై నిఘా ఉంచి సత్ప్రవర్తన మార్గంలో నడిపించాలని డీఎస్పీ సూచించారు. మోడల్ కాలనీ యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande