ఫీజు రీయింబర్స్మెంట్’ రద్దుకు కుట్ర (update)
జీవో నం.7తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిద్ర కరవైంది సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ
KTR


హైదరాబాద్, 04 మే (హి.స.)ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబరు 7ను తీసుకొచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ జీవో తీసుకొచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు.. లక్షల మంది నిరుపేద తల్లిదండ్రులకు కంటి మీద కునుకు కరవైందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదివారం కేటీఆర్ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అండగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర సరికాదు. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికిపైగా పిల్లలు తనువు చాలించారు. కనీసం విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తర్వాత కేసీఆర్ కొనసాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. జీవో నంబరు 7ను వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమ చేస్తామంటే ఎవరు నమ్ముతారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపి వారిని అప్పుల పాలు చేస్తామనే ప్రభుత్వ కుట్రలను భారాస ఉపేక్షించదు. అలాగే రూ.10 వేల కోట్ల బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించకపోవడం సరికాదు. విద్యార్థులు గర్జిస్తే మీరు, మీ మంత్రులు రోడ్లపై తిరగలేరు.’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande