
అనంతపురం, 02 మే (హి.స.)మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర క్వింటా రూ.2400తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని బోడిగానిదొడ్డి గ్రామంలో రైతులతో కలిసి 544-డి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బిహెచ్.రాయుడు మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల్లో రైతుల అప్పులు చేసి మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. గత రెండు నెలల ముందు క్వింటా రూ.2600 ఉన్న ధర ప్రస్తుతం పంట చేతికొచ్చే అమ్మే దశలో దళారులు కుమ్మక్కై క్వింటా రూ.1500 నుంచి రూ.1600కు మించి కొనడం లేదన్నారు. పంట దిగుబడి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఎకరాకు 20 క్వింటాలకు మించి రాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో దళారులు కుమ్మక్కై ధర తగ్గించడంతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగుచేసిన అన్ని గ్రామాల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర రూ.2400తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలన్నారు. రబీలో ఇవ్వాల్సిన పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, పెండింగ్లో ఉన్న పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి శ్యాంసుందర్ రెడ్డి, బుక్కరాయసముద్రం సిఐ కె.పుల్లయ్య వారివద్దకొచ్చి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV