
కామారెడ్డి , 03 మే (హి.స.)
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో
శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందిరాచౌక్ వద్ద గల సుమారు 18 దుకాణాలు, హోటళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
రోజు మాదిరిగానే శనివారం రాత్రి వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి 1 గంట తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో 18 షాపులకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. వేసవి కాలం కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఒకదాని తర్వాత మరొక షాపులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే షాపుల పక్కన చెత్తకుప్పకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఆదివారం ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఇందిరా చౌక్ వద్ద గత కొన్నేళ్లుగా వ్యాపారులు దుకాణాలు, చ హోటల్ లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదంతో వ్యాపారులు
రోడ్డున పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు