
నిజామాబాద్ , 03 మే (హి.స.)రాష్ట్రంలో 12 జిల్లాలపై సూరీడు నిప్పులు కక్కాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఠారెత్తారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా అనుముల హాలియా, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సిద్దిపేట జిల్లా తొగుట మండలాల్లో 45.9, ఆదిలాబాద్ అర్బన్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లలో 45.8, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలలో 45.7, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 45.6, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 45.5, ఖమ్మం జిల్లా బోనకల్లులో 45.2, మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో 45.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 42.6 నుంచి 44.6 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఇదే మాదిరి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరో తేదీ అనంతరం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగు డిగ్రీల వరకు తగ్గుతాయని, కాస్తంత ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్