ఐపీఎల్ టికెట్ మాఫియా గుట్టురట్టు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
హైదరాబాద్లో ఐపీఎల్ సందడి నెలకొన్న వేళ, టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు.
IPL 2026 Scam


హైదరాబాద్, 03 మే (హి.స.)హైదరాబాద్లో ఐపీఎల్ (IPL) సందడి నెలకొన్న వేళ, టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను మల్కాజ్గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ఆపరేషన్లో వెలుగుచూసిన అంశాలు క్రికెట్ అభిమానులను, క్రీడావర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని, కొంతమంది అక్రమ మార్గంలో టికెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

పోలీసుల విచారణలో ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. సాధారణంగా క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం వివిధ క్లబ్ సెక్రెటరీలకు కాంప్లిమెంటరీ కోటా కింద టికెట్లు కేటాయిస్తారు. అయితే, ఈ టికెట్లే ఇప్పుడు బ్లాక్ మార్కెట్కు ప్రధాన వనరుగా మారాయని పోలీసులు గుర్తించారు. ఒక్కో క్లబ్ సెక్రెటరీకి సుమారు 17 టికెట్ల వరకు కేటాయించినట్లు విచారణలో తేలింది. అసలు ధర కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ధరకు (డబల్ రేట్లకు) ఈ టికెట్లను క్రికెట్ అభిమానులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ప్రతినిధుల నుంచి టికెట్లు సేకరించి, వాటిని మధ్యవర్తుల ద్వారా స్టేడియం పరిసరాల్లో, సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్దఎత్తున ఐపీఎల్ టికెట్లను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్లను అనధికారికంగా, బ్లాక్ మార్కెట్లో విక్రయించడం నేరమని పోలీసులు హెచ్చరించారు. కేవలం అధికారిక ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని, మోసగాళ్ల బారిన పడవద్దని పోలీసులు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande