
యాదాద్రి భువనగిరి, 03 మే (హి.స.)
మంత్రి సీతక్క మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను స్వయంగా తన కారులో ఆస్పత్రికి చేర్చి వైద్య సహాయం అందేలా చూసారు. కాగా సీతక్క ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ములుగుకు వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరగడాన్ని ఆమె గమనించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విలపిస్తున్న కుటుంబాన్ని చూసి ఆమె వెంటనే తన కాన్వాయ్ ని ఆపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏడుస్తున్న చిన్న పిల్లలను స్వయంగా తన చేతులతో ఎత్తుకుని కాన్వాయ్ వాహనంలోకి ఎక్కించారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా వైద్యులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా స్వయంగా పర్యవేక్షించారు.
మంత్రి సీతక్క చేసిన పని ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లు తుడిచే ఒక బాధ్యత అని మరోసారి నిరూపించింది. రోడ్డు ప్రమాద సమయంలో బాధితులను ఆదుకోవడానికి ఆమె చూపించిన చొరవను పలువురు అభినందించారు. ప్రోటోకాల్ కంటే ప్రాణం ముఖ్యమని భావించిన ఆమె తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు