
హైదరాబాద్, 03 మే (హి.స.)ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరులో రేపు (సోమవారం) రైతు వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువస్తామని తెలిపారు. రైతు వారోత్సవాల్లో అన్నదాతలతో ప్రత్యక్షంగా అధికారులు మమేకం కానున్నారని వివరించారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్ వేదికగా మంత్రి తుమ్మల మాట్లాడారు.
చివరి రైతు వరకు ప్రభుత్వ పథకాల చేరవేతే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. మట్టి ఆరోగ్యం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. మైక్రో ఇరిగేషన్పై రైతులకు సూచనలు ఇస్తామని, మార్కెట్ లింకేజులు, రుణాలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. డ్రోన్లు, యాంత్రీకరణ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని.. పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతన్నలకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తారని అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్