
హైదరాబాద్, 03 మే (హి.స.) దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాల కోసం
నిర్వహించిన నీట్ -2026 పరీక్షలు ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని కేంద్రీయ విద్యాలయం, కంచన్ బాగ్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఉదయం నుంచే తమ తల్లిదండ్రులతో కలిసి చేరుకుని ఉత్సాహంగా కనిపించారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో పోలీసులు 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేసి, అనుమతి లేని వ్యక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. కేంద్రంలోకి ప్రవేశం ఇవ్వడానికి ముందు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
హాల్ టికెట్, గుర్తింపు కార్డులను సరి చూసిన తర్వాత మాత్రమే విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా, పారదర్శకతను కాపాడేందుకు తీసుకున్న ఈ చర్యలు ప్రశంసనీయం అని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక పరీక్ష సాఫీగా కొనసాగుతుండటం పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..