
తెలంగాణ, 03 మే (హి.స.)
ఎండ వేడిమితో అల్లాడుతున్న రాష్ట్ర
ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మే 5వ తేదీన (ఎల్లుండి) రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ, రేపు రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చు. గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు నమోదవుతున్నాయి. అయితే.. ఈ వర్షాల ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు