
గోదావరిఖని, 03 మే (హి.స.)
సింగరేణి సంస్థ ఎంతో కాలంగా
ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది.. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుండి సింగరేణి యాజమాన్యానికి సందేశం అందింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గనిర్దేశంలో డైరెక్టర్లు, అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం విశేషం.
సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం ప్రకటిస్తోంది. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భగనుల పరిధిలోని బొగ్గును ఇంకా తవ్వి తీయటానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు ప్రధానంగా సమీపంలోని ఎన్టీపీసీ రామగుండం వారికి, ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం సరఫరా చేయనున్నారు. ప్రకృతి వరమైన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే లక్ష్యం. మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్, మూతపడనున్న వకీల్ పల్లి భూగర్భగనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీయడంతో పాటు, ఈ గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడం కోసం, వీటన్నిటినీ కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్ట ప్రాజెక్టుకు కంపెనీ రూపకల్పన చేయడం జరిగింది.
ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో, పర్యావరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేసుకోవడంతోపాటు ఈ గని రామగుండం రీజియన్ కు మరో 25 సంవత్సరాల జీవిత కాలాన్ని అందించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు