చెరువుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు
చెరువుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు
Uttam kumar reddy


హైదరాబాద్, 03 మే (హి.స.)రాష్ట్రంలోని చెరువుల పరిరక్షణకు నామినేటెడ్ విధానంలో కమిటీలను ఏర్పాటు చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమిటీలలో రైతులు, స్థానిక అధికారులకు చోటు కల్పించాలని సూచించారు. నెలన్నర క్రితమే చెరువుల పూడికతీత ప్రారంభించాలని ఆదేశించినా ఇప్పటికీ పనులు చేపట్టలేదంటూ ఇంజినీర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నీటివనరులపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన సిఫార్సులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఫార్సుల తీరును అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లో తక్షణం ఆచరణలోకి తేవాల్సిన వాటిపై దృష్టి సారిస్తాం. ఇప్పటికే ఉన్న నిబంధనలతో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత చేపట్టాలి. వేసవిలో పూడికతీతను అత్యవసర ప్రాధాన్యం కింద తీసుకోవాలి. తక్షణమే అన్ని చెరువుల్లో పనులు ప్రారంభించాలి. చెరువుకట్టల బలోపేతం, తూముల మరమ్మతులు, పరీవాహక ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలి. నేల కోతను నివారించేందుకు మొక్కలు నాటాలి. రైతులు పూడిక మట్టిని తరలించేలా ప్రోత్సహించాలి. చెరువుల ఆక్రమణలు, హద్దుల ఏర్పాటుపైనా దృష్టి సారించాలి. జూరాల ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టుల్లోనూ పూడికతీతకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమైనందున వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి’ అని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande