రేవంత్ రెడ్డిపై అక్కసుతొ జీవన్ రెడ్డి విమర్శలు: ఆది శ్రీనివాస్
రేవంత్ రెడ్డిపై అక్కసుతొ జీవన్ రెడ్డి విమర్శలు: ఆది శ్రీనివాస్
Whip


హైదరాబాద్, 03 మే (హి.స.)

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. పదేళ్లలో గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. యువత త్యాగాలను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసుతోనే జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని కానీ ప్రజలు రేవంత్ రెడ్డి పాలననే కోరుకుంటున్నారన్నారు. ఆదివారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. పార్టీ మారిన జీవన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్లో ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని అనేక వేదికలపై చెప్పారన్నారు. కండువా మార్చగానే మాట మార్చారని ఎద్దేవా చేశారు.

ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను జీవన్ రెడ్డి పొగిడిన మాట వాస్తవం కాదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. సన్నబియ్యం పథకం గేమ్ చేంజర్ స్కీమ్ అని అన్నది మీరే కదా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాపాల పాలనపై ఒంటరి పారాటం చేశానని చెప్పిన జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రజా పాలన పోవాలని అనడంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డే కావాలని, రేవంత్ రెడ్డినే మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ భవన్ అని కేసీఆర్, హరీశ్ రావు అబద్దాల కోరులని అక్కడికి వెళ్లగానే జీవన్ రెడ్డి కూడా అబ్బద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande