
అమరావతి, 03 మే (హి.స.)
తిరుమల, శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ వారాంతంలో కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి ఎలాంటి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డు మీదుగా శిలాతోరణం బాటగంగమ్మ ఆలయం మధ్య క్యూలైన్లో ప్రవేశిస్తున్నారు. వీరికి దాదాపు 14 గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తితిదే ఉన్నతాధికారులు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. శ్రీవారిని 71,008 మంది భక్తులు దర్శించుకోగా హుండీ కానుకలు రూ.3.52 కోట్లు లభించాయి.
తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల సిఫారసు లేఖలపై జారీచేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించలేదు. రద్దీకి అనుగుణంగా జూన్, జులై వరకు సిఫారసు లేఖలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. తితిదే అధికారికంగా ప్రకటన చేయకున్నా గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ప్రస్తుతం వాటిని నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఈ నెల 6న జరిగే తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయం వెల్లడించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ