
తిరుమల , 03 మే (హి.స.) వేసవి సెలవుల ప్రభావంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తుల జనసందోహంతో పోటెత్తింది. శనివారం సెలవు దినం కావడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో సప్తగిరులు కిటకిటలాడాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందంటే, స్వామివారికి మొక్కులు చెల్లించుకునే కల్యాణకట్ట ప్రాంతం 36,257 మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం కేవలం శనివారం నాడే రూ. 3.37 కోట్లుగా నమోదై రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం తిరుమలలో రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేడు ఆదివారం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దీనివల్ల సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తుల క్యూ లైన్లు ఏటీజీహెచ్ (ATGH) ప్రాంతం వరకు కొనసాగుతోంది. దర్శన టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులు వెలుపల వేచి ఉండాల్సి వస్తోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా పాలు, తాగునీరు, ప్రసాద వితరణ చేస్తోంది. వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున, భక్తులు తగినంత ఓపికతో వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV