సోషల్ మీడియా వేదికగా దారుణ మోసాలు.. ఎస్పీ తుషార్ డూడి కీలక సూచనలు
సోషల్ మీడియా వేదికగా దారుణ మోసాలు.. ఎస్పీ తుషార్ డూడి కీలక సూచనలు
sp-tushar-dudis-key-suggestions-on-cyber-fraud-54


చిత్తూరు, 03 మే (హి.స.)

డిజిటల్ యుగంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ‘హనీ ట్రాప్’ సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు.

ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ దారుణ మోసాలపై ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువతులు లేదా యువకుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, ముందుగా స్నేహం నటిస్తారని ఎస్పీ తెలిపారు. బాధితుల విశ్వాసాన్ని పొందాక, వీడియో కాల్స్ ద్వారా వారి వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి, అనంతరం వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.

డబ్బు కోల్పోవడం కన్నా గౌరవం కోల్పోవడం పెద్ద నష్టమని భావించి చాలామంది భయంతో పోలీసులకు చెప్పడం లేదు. హనీ ట్రాప్ బారిన పడితే అస్సలు భయపడొద్దు. వెంటనే పోలీసులను సంప్రదించండి. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ భరోసా ఇచ్చారు. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని.. కొత్తగా పరిచయమైన వారితో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని... గుర్తుతెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ చేయడం ప్రమాదకరమని... మోసపోయామని గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబరు 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. యువత ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు ఒక కన్ను వేసి ఉంచాలని, సైబర్ భద్రత పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అప్రమత్తతే సైబర్ నేరాలకు సరైన విరుగుడని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande