కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్ లో ఒక వివాహిత దారుణ హత్య
కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్ లో ఒక వివాహిత దారుణ హత్య
కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్ లో ఒక వివాహిత దారుణ హత్య


కృష్ణా జిల్లా,, 04 మే (హి.స.)

కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్లో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో.. భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు దిమ్మెట లక్ష్మీప్రసన్న (30). ఆమెకు 13 ఏళ్ల క్రితం మీర్జాపురం గ్రామానికి చెందిన మురళీకృష్ణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా లక్ష్మీప్రసన్న తన భర్త, పిల్లలను వదిలిపెట్టి నిడుమోలు గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. లక్ష్మీప్రసన్న వివాహేతర సంబంధం పెట్టుకుని దూరంగా ఉండటాన్ని భర్త మురళీకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. సోమవారం తెల్లవారుజామున గాంధీనగర్లో ఉన్న లక్ష్మీప్రసన్నపై మురళీకృష్ణ తన ఇద్దరు సోదరులతో కలిసి దాడికి దిగాడు

ఇనుపరాడ్తో ఆమె తలపై బలంగా కొట్టడంతో, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే పామర్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సహకరించిన భర్త మురళీకృష్ణతో పాటు అతని ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande