రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ
రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ
/attack-on-ysrcp-leader-dasaratha-rami-reddy-in-rayachoti


రాయచోటి, 04 మే (హి.స.)

అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత, రాయచోటి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పి. దశరథరామిరెడ్డిపై నిన్న హత్యాయత్నం జరిగింది. భూవివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, దశరథరామిరెడ్డికి చెందిన కల్యాణమండపం సమీపంలోని ఓ స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, ఆదివారం సుమారు 100 మంది ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు వివాదాస్పద స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రశ్నించిన దశరథరామిరెడ్డిపై వారు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దశరథరామిరెడ్డితో పాటు ఆయన అనుచరులు జాకీర్, దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారు కల్యాణమండపాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు.

ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని మిథున్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భూమన విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande