
తిరుమల, 04 మే (హి.స.)
తిరుమలలో మోస్తరు భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు, టెన్త్ పరీక్ష ఫలితాలు వెలువడటం, వారాంతం కావడంతో శుక్ర, శనివారం,ఆదివారం ల్లో కొండపై రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. స్వామి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూకట్టారు. ఈ రోజు మాత్రం వెలుపల క్యూలైన్లు కనిపించకపోయినప్పటికీ వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి పార్కులోని ఓ షెడ్డు కూడా సర్వదర్శన భక్తులతో నిండింది. వీరికి దాదాపు 10 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు ఆలయ ప్రాంతం, లడ్డూకౌంటర్, సీఆర్వో, ప్రధాన కూడళ్లు, వెలుపలి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సమయంలో కొద్ది సమయం వర్షం కురిసి నిలిచిపోయింది.
శనివారం 91,005 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి, సమర్థవంతమైన క్యూలైన్ల నిర్వహణతో ఈ స్థాయిలో భక్తులకు దర్శనం చేయించగలిగారు. మరోవైపు 36వేల మంది స్వామికి తలనీలాలు సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV